1, మే 2016, ఆదివారం

గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి. వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని పోలి ఉంటుంది. అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు. గోమతిచక్రం నత్తగుళ్ళని పోలి ఉంటుంది కాబట్టి వీటిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. గోమతి చక్రాలు వెనుకభాగం ఉబ్బెత్తు గాను, ముందుభాగం చదరం (ఫ్లాట్) గాను ఉంటుంది. వృషభ రాశి, రోహిణి రాశులు శుక్రగ్రహానికి చెందినవి, శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వల్ల ఈ చక్రాల ఉపయోగం అనేకం, అనంతం, అత్యంత శ్రేష్ఠం అని చెప్పవచ్చు. జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారణం కావడం వలన గోమతి చక్రాన్ని ధరించడం వల్ల అనేక శ్రేష్టమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయి. గోమతిచక్రలు రెండు రంగులలో లభిస్తాయి తెల్లనివి, ఎరుపువి. తెలుపురంగు గోమతిచక్రాలను అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ధరించడానికి ఉపయోగపడతాయి. ఎరుపురంగు గోమతి చక్రాలు వశీకరణం, శత్రునాశనం, క్షుద్రపూజలకు, తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగించాలి. గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడం, వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబరచకపోవడం వంటి దోషాలు సైతం గోమతిచక్ర ధారణ వల్ల నివారింపబడతాయి.
గోమతి చక్రాల పూజా విధానం
గోమతి చక్రాలను సిద్ధం చేసుకుని వాటిని ముందుగా గంగాజలం లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని పరిశుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి, గోమతిచక్రాలను 'శ్రీయంత్రం' లేదా 'అష్టలక్ష్మీ యంత్రం' తో పీఠంపై అమర్చుకోవాలి. గోమతి చక్రాల పూజను శుక్రవారం రోజు, దీపావళి రోజు లేదా వరలక్ష్మీవ్రతం రోజు చేసుకుని మనకు కావలసిన సమయాలలో తీసుకుని ఉపయోగించవచ్చు. గోమతి చక్రాలను లలితా సహస్ర నామాలను జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని అర్చన చేయాలి. పూజ పూర్తయిన తరువాత గోమతి చక్రాలను ఎఱ్ఱని బట్టలో కాని, హనుమాన్ సింధూరంలో కానీ పెట్టుకోవాలి. గోమతి చక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు బీరువాలో భద్రపరచుకోవాలి.
గోమతి చక్రాల ఉపయోగాలు ?
*    ఒక గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వల్ల మనుషులలోని రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి                 లభిస్తుంది.
*    గోమతిచక్రాన్ని లాకెట్ రూపంలో ధరిస్తే నరదృష్టి బాధలనుండి విముక్తి కలుగుతుంది, బాలారిష్ట దోషాలు కూడా సమసిపోతాయి.
*    రెండు గోమతిచక్రాలను బీరువాలో కాని పర్సులో కాని ఉంచినట్లయితే ధనాభివృద్ధి కలిగి ఎప్పుడూ ధనానికి లోటు ఉండడు.
*    రెండు గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే' పరుపు క్రింద కాని దిండు క్రింద కాని ఉంచినట్లయితే వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవలు లేకుండా           అన్యోన్యంగా ఉంటారు.
*    మూడు గోమతి చక్రాలను బ్రాస్ లెట్ లా చేసుకుని చేతికి ధరిస్తే  జనాకర్షణ, కమ్యూనికేషన్, సహకారం లభిస్తుంది.
*    మూడు గోమతి చక్రాలను మన దగ్గర అప్పుగా తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వని వారి పేరు మూడు గోమతిచక్రాల మీద అతని పేరువ్రాసి నీటిలో                వేయటం కాని వాటిని వెంట పెటుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా యిచ్చే అవకాశం ఉంటుంది.           (ఈ ప్రయోగాన్ని మంగళవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది)
*    నాలుగు గోమతి చక్రాలను పంట భూమిలో పొడిచేసి కాని మామూలుగా కాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.
*    నాలుగు గోమతి చక్రాలను గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో భూమిలో స్థాపించడం వలన ఆ ఇళ్ళు త్వరగా పూర్తయి అందులో నివశించే            వారు సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు.
*    నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారింప బడతారు.
*    ఐదు గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకి కట్టడం వలన గర్భం నిలుస్తుంది.
*    ఐదు గోమతి చక్రాలను చదువుకునే పిల్లల పుస్తకాల దగ్గర ఉంచడం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచనా విధానంలో మార్పులు            ఉంటాయి.
*    ఐదు గోమతి చక్రాలను నదిలో కాని జలాశయంలో కాని విసర్జన చేస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది.
*    ఆరు గోమతి చక్రాలను అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.
*    ఆరు గోమతి చక్రాలు ఇంట్లో ఉంచుకుంటే శత్రువులపై విజయం సాధించవచ్చు, కోర్టు గొడవలు ఉండవు, ఉన్నా విజయం సాధిస్తారు.
*    ఏడు గోమతి చక్రాలు ఇంటిలో ఉండడం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి.
*    ఏడు గోమతిచక్రాలను నదిలో విసర్జన చేసిన దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.
*    ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు.
*          తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండడం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. ఆ ఇంట్లోని వ్యక్తులు           సమాజంలో గౌరవించబడతారు.
*    పది గోమతి చక్రాలు ఆఫీసులో ఉండడం వలన ఆ సంస్థకి అమితమైన గుర్తింపు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి, వారు               సమాజంలో గొప్ప పేరుప్రఖ్యాతలతో గుర్తింపబడతారు.
*    పదకొండు గోమతి చక్రాలు లాభ లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచడం వలన              ఎటువంటి వాస్తుదోషా, శల్యదోషాలు ఉండవు.
*    పదమూడు గోమతి చక్రాలను శివాలయంలో దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
*    27 గోమతిచక్రాలను వ్యాపార సముదాయంలో ద్వారబంధానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం ద్వారా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.
*    జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నవారు పంచమస్థానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి కాని, సాంగత్యం కాని ఉన్న సంతాన దోషం           ఉంటుంది. దీనినే నాగదోషం అంటారు. జాతకంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషం అంటారు. ఈ రెండు           దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలకు పూజించడం గాని, దానం చేయడం గాని, గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించడం చేయాలి.