27, ఆగస్టు 2022, శనివారం

వినాయకుడ 8 ముఖ్యమైన పేర్లు , వాటి వివరణ

👉 వక్రతుండుడు :-   

పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలావిలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం.


👉ఏకదంతుడు :–  

చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి, దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు... ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులుతీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యవత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా!


👉మహోదరుడు :–   

శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదయ్యే! దాంతో పార్వతి కంగారుపడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది. ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబోదరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా లంబోదరుడు నిలుస్తారు.


👉గజాననుడు :–   

కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాక తప్పవు. ఇతే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం.

లంబోదరుడు – దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు, విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజరూపంలోకి వచ్చాడో... శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జనించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు, ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన (ప్రీతి) దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం.


👉వికటుడు – 

పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది.


👉విఘ్నరాజు – 

కామ, క్రోధ, మోహ, లోబ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి.


👉ధూమ్రవర్ణుడు – 

అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం.

13, ఆగస్టు 2022, శనివారం

జప విధి విధానాలు

మంత్రం అంటే 'మ' మననము చేసేవారిని  'త్ర' త్రాణము కాపాడేది అని అర్థం! జపం అంటె  'జ' జన్మ విఛ్ఛేదము చేసేది !  'ప' పాపాలను నశింప చేసేది అని అర్థం. మంత్ర జపం వలన మన శరీరంలో నాడీస్పందనము కలిగి, మహాశక్తి ఉద్భవిస్తుంది. శరీరానికి ఉత్తేజం కలిగి, బుద్ది వికసిస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జన్మార్జిత పాపాలన్ని నశిస్తాయి.

ముందుగా గురువు నుంచి మంత్ర దీక్ష పొంది. శుచిగా,ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని , ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని జపం చేయాలి. కాస్టాసనమున కూర్చుని జపం చేస్తే దుఃఖం,ఋణబాధ కలుగుతుంది. రాతిపై కూర్చుని జపం చేస్తే వ్యాధి సంభవిస్తుంది. ధర్మాసనం పై కూర్చుని జపం చేస్తే వశీకరణం, పాపనాశనం, రోగవిముక్తి, వస్త్రం పై కూర్చుని జపం చేస్తే దారిద్ర్యం.  ''కృష్ణాజినే జ్ఞానసిద్ది ర్మోక్షసీ వ్యాఘ్రచర్మణే, కుశాసనే యోగసిద్ది స్సర్వస్ద్యస్తు కంబళే '' అని శాస్త్ర వచనం! ధర్భాసనం ,చిత్రాసనం పీటపై వేసుకొని జపం చేయడం మంచిది....

||అంగుష్ఠేతు మోక్షార్థీ తర్జనీ ధనవర్థనీ మధ్యమాంగుళ్యం విధ్యార్థీ మరణం అనామికం తథా కనిష్ఠా కర్షణం చైవ ఇత్యైతే జపలక్షణమ్ ||

జపం చేసేటప్పుడు చేతికొనలతో లెక్కిస్తే ఏకగుణ ఫలితం,వ్రేళ్ళ కణుపులతో లెక్కిస్తే దశగుణ ఫలితం. ఉంగరపు వేలు మధ్యకణుపు మొదలుకొని ప్రదక్షిణంగా అన్ని వ్రేళ్ళ కొనలమీదగా చూపుడు వేలు మూలము వరకు లెక్కించిన పది అవుతుంది. ఇలా కణుపుల ద్వారా లెక్కించడం మంచిది. శంఖములు, మణులు కలిగిన మాలతో జపం చేస్తే దాని ఫలితం శతగుణం! పగడపు మాలతో జపం చేస్తే సహస్ర ఫలం! ముత్యాల మాలతో జపం చేస్తే పది లక్షల రెట్లు ఎక్కువ ఫలితం. స్పటిక మాల జపం పది లక్షల రెట్లు ఫలితం. తులసీ మాల, రుద్రాక్ష మాల, దర్భగ్రంథులతో చేసిన జపం చాలా ఫలదాయకం . 

సాధకులు స్థిరంగా, సుఖాసనం లో ప్రశాంతంగా కూర్చుని నిటారుగా కూర్చొని, మంత్రం బయిటకు వినబడకుండా జపం చేయాలి. జప మాలను వస్త్రం తో మూసివేయాలి. 

ప్రతీ రోజూ విధిగా మంత్రోపాసన చేసే వారు నిత్యజపానికి ఒక శాశ్వత ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఆ గది కూడా చీకటిగా ఉండటం,పూజా సామాగ్రి తప్ప మరో వస్తువు లేకుండా ఉంటే చాలా మంచిది. ప్రతీ వీలైనంత వరకు ఒకే సమయంలో జపానికి కూర్చోవడం ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

6, ఆగస్టు 2022, శనివారం

శిశుజననము - నక్షత్రాలు

పిల్లలు జన్మించినప్పుడు వెంటనే పుట్టిన నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని:- 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము ౩ నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిముషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణీ:- 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును.

3. కృత్తిక నక్షత్రములో:- 3 వ పాదము లో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము:- 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర:- 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము:- 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము:- 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము:- కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . మూడు, నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.

9. ఆశ్లేష నక్షత్రములో:- 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్రము:- 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును . 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్రము:- 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్రము:- 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రము:- 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15 స్వాతి నక్షత్రము:- 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16 విశాఖనక్షత్రము:- జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రము:- 1 2 3 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము:- ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక దోషం కలుగును. 1 వ భాగములో తాతయ్యకు 2 అమ్మమ్మ కు ౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు 6 ఎవ్వరికి దోషము ఉండదు 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు 8 జాతకునకు 9 తల్లికి 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి .

19. మూల నక్షత్రము:- ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండను. ఈ నక్షత్రము లో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి.

పన్నెండు భాగాలలో 1 వ భాగము తండ్రికి దోషము 2 తల్లికి ౩ అన్నలకు 4 భాగస్వాములకు 5 పిల్లనిచ్చిన మామగారికి 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 ధనమునకు 9 జీవన నాశనము 10 దరిద్రమును కల్గిస్తుంది 11 భ్రుత్యులు 12 జాతకునికి నాశనము కలుగ చేయును.

*జ్యేష్ట ,మూలా నక్షత్రములలో* జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20 పూర్వాషాడ నక్షత్రము:- పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు .

21 ఉత్తరాషాడ నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

22 శ్రవణం నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

23 ధనిష్ట నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

24 శతభిషం నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

25 పూర్వాబాద్ర నక్షత్రము:- 1 2 3 పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .

26 ఉత్తరాభాద్ర నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

27 రేవతి నక్షత్రము:- 1 2 3 పాదములలో జననము దోషము లేదు . 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.