మంత్రం అంటే 'మ' మననము చేసేవారిని 'త్ర' త్రాణము కాపాడేది అని అర్థం! జపం అంటె 'జ' జన్మ విఛ్ఛేదము చేసేది ! 'ప' పాపాలను నశింప చేసేది అని అర్థం. మంత్ర జపం వలన మన శరీరంలో నాడీస్పందనము కలిగి, మహాశక్తి ఉద్భవిస్తుంది. శరీరానికి ఉత్తేజం కలిగి, బుద్ది వికసిస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జన్మార్జిత పాపాలన్ని నశిస్తాయి.
ముందుగా గురువు నుంచి మంత్ర దీక్ష పొంది. శుచిగా,ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని , ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని జపం చేయాలి. కాస్టాసనమున కూర్చుని జపం చేస్తే దుఃఖం,ఋణబాధ కలుగుతుంది. రాతిపై కూర్చుని జపం చేస్తే వ్యాధి సంభవిస్తుంది. ధర్మాసనం పై కూర్చుని జపం చేస్తే వశీకరణం, పాపనాశనం, రోగవిముక్తి, వస్త్రం పై కూర్చుని జపం చేస్తే దారిద్ర్యం. ''కృష్ణాజినే జ్ఞానసిద్ది ర్మోక్షసీ వ్యాఘ్రచర్మణే, కుశాసనే యోగసిద్ది స్సర్వస్ద్యస్తు కంబళే '' అని శాస్త్ర వచనం! ధర్భాసనం ,చిత్రాసనం పీటపై వేసుకొని జపం చేయడం మంచిది....
||అంగుష్ఠేతు మోక్షార్థీ తర్జనీ ధనవర్థనీ మధ్యమాంగుళ్యం విధ్యార్థీ మరణం అనామికం తథా కనిష్ఠా కర్షణం చైవ ఇత్యైతే జపలక్షణమ్ ||
జపం చేసేటప్పుడు చేతికొనలతో లెక్కిస్తే ఏకగుణ ఫలితం,వ్రేళ్ళ కణుపులతో లెక్కిస్తే దశగుణ ఫలితం. ఉంగరపు వేలు మధ్యకణుపు మొదలుకొని ప్రదక్షిణంగా అన్ని వ్రేళ్ళ కొనలమీదగా చూపుడు వేలు మూలము వరకు లెక్కించిన పది అవుతుంది. ఇలా కణుపుల ద్వారా లెక్కించడం మంచిది. శంఖములు, మణులు కలిగిన మాలతో జపం చేస్తే దాని ఫలితం శతగుణం! పగడపు మాలతో జపం చేస్తే సహస్ర ఫలం! ముత్యాల మాలతో జపం చేస్తే పది లక్షల రెట్లు ఎక్కువ ఫలితం. స్పటిక మాల జపం పది లక్షల రెట్లు ఫలితం. తులసీ మాల, రుద్రాక్ష మాల, దర్భగ్రంథులతో చేసిన జపం చాలా ఫలదాయకం .
సాధకులు స్థిరంగా, సుఖాసనం లో ప్రశాంతంగా కూర్చుని నిటారుగా కూర్చొని, మంత్రం బయిటకు వినబడకుండా జపం చేయాలి. జప మాలను వస్త్రం తో మూసివేయాలి.
ప్రతీ రోజూ విధిగా మంత్రోపాసన చేసే వారు నిత్యజపానికి ఒక శాశ్వత ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఆ గది కూడా చీకటిగా ఉండటం,పూజా సామాగ్రి తప్ప మరో వస్తువు లేకుండా ఉంటే చాలా మంచిది. ప్రతీ వీలైనంత వరకు ఒకే సమయంలో జపానికి కూర్చోవడం ఉత్తమ ఫలితాలు ఉంటాయి.